
రామాలయంలో ప్రత్యేక పూజలు
రామాలయంలో ప్రత్యేక పూజలు
స్వామివారిని దర్శించుకున్న సినీ నటులు
భద్రాచలం, న్యూస్‌టుడే: శ్రీ సీతారామచంద్రస్వామి వారి ఆలయంలో సోమవారం స్వామివారు ముత్తంగి రూపంలో దర్శనమిచ్చారు. ముత్యాలతో పొదిగిన వస్త్రాలను అలంకరించడంతో సీతారాములవారు శోభాయమానంగా సాక్షాత్కరించారు. ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించి సుప్రభాత సేవను కనుల పండువగా జరిపించారు. ఆరాధన నిర్వహించి స్వామివారి నామాలను పఠించి విష్వక్సేనుల వారిని భక్తిశ్రద్ధలతో పూజించారు. దర్బారు సేవ మంత్రముగ్ధులను చేసింది. ఉదయం నుంచి ప్రముఖులు ప్రత్యేక దర్శనాలు చేసుకున్నారు. సినీ, టీవీ నటులు జయలలిత, రాగిని, విజయ్ స్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు. ఇప్పటి వరకు 650 సినిమాలు 30 ధారావాహికల్లో నటించినట్లు సీనియర్ నటి జయలలిత తెలిపారు. దైవదర్శనం బాగా జరిగిందన్నారు. వీరికి అర్చకులు ఆశీర్వచనం పలికారు. అభిమానులు వీరితో ఫొటోలు దిగేందుకు ఉత్సాహం చూపించారు. ఏపీకి చెందిన స్టాంపింగ్ అండ్ రిజిస్ట్రేషన్స్ ఐజీ వెంకట్రామిరెడ్డి ఆలయాన్ని దర్శించుకోవడంతో ఆయనకు మర్యాద పూర్వకంగా అధికారులు స్వాగతం పలికారు. లక్ష్మీతాయారు అమ్మవారి ఆలయంలో అర్చకులు, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ప్రధాన ఆలయంతోపాటు అనుబంధంగా ఉన్న ఆంజనేయస్వామివారిని దర్శించుకొని పూజలు చేశారు.