బాలికల గురుకుల పాఠశాల ప్రారంభం
బల్లేపల్లి, న్యూస్‌టుడే: రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ద్వారా జిల్లాలో నూతనంగా మంజూరైన కూసుమంచి బాలికల గురుకుల పాఠశాలను జిల్లా సమన్వయ అధికారి పి.భరత్ బాబు సోమవారం టేకులపల్లిలోని గురుకుల పాఠశాలలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేద విద్యార్థుల కోసం నూతన గురుకుల పాఠశాలలను మంజూరు చేయడం ఆనందదాయకమన్నారు. నాణ్యమైన విద్యతో పాటు అన్ని రంగాల్లో బాలికలను తీర్చిదిద్దేందుకు సౌకర్యాలు కల్పిస్తామన్నారు. కూసుమంచి మండలానికి బాలికల గురుకుల పాఠశాల మంజూరు అయ్యిందని, తక్షణ నిర్వహణలో భాగంగా టేకులపల్లిలోని గురుకుల పాఠశాలలో తాత్కాలిక వసతి, విద్యను అందిచనున్నట్లు తెలిపారు. ఇల్లెందుకు మంజూరైన గురుకుల పాఠశాలను వైరాలో, సత్తుపల్లి మండలానికి మంజూరైన పాఠశాలను దమ్మపేటలో ప్రారంభించినట్లు చెప్పారు. నూతన భవనాల నిర్మాణం చేపట్టిన వెంటనే కూసుమంచి, ఇల్లెందు, సత్తుపల్లి మండలాలకి తిరిగి మారుస్తామని అన్నారు. అనంతరం పాఠశాల ఆవరణలో విద్యార్థులు, ఉపాధ్యాయులు హరితహారంలో భాగంగా మొక్కలు నాటారు. కార్యక్రమంలో సహాయ సమన్వయ అధికారి వి.వెంకటేశ్వరరావు, కూసుమంచి, టేకులపల్లి గురుకుల పాఠశాలల ప్రిన్సిపాళ్లు జి.విజయకుమారి, మేరి యేసుపాదం, అంబేడ్కర్ కళాశాల ప్రథానాచార్యులు కె.స్వరూపారాణి, స్వేరోస్ జిల్లా కార్యదర్శి మందుల వెంకన్న, నాగరాజు తదితరులు పాల్గొన్నారు.