Explore Projects Across Khammam

drinking water facility news in khammam real estate

త్వరలో ఇంటింటికీ మిషన్ భగీరథ నీరు

(కూసుమంచి, నమస్తే తెలంగాణ);ఆగస్టులో 17 తండాలకు.. సెప్టెంబర్‌లో 71 గ్రామాలకు.. పైలట్ ప్రాజెక్టుగా కూసుమంచి.. రూ.12 కోట్లు మంజూరు ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చేందుకు ముహూర్తం ఖరారు నేడు కూసుమంచి మండలం రావిచెట్టుతండాలో భూమి పూజపాల్గొననున్న మంత్రి తుమ్మల, భగీరథ వైస్‌చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి మిషన్ భగీరథ ప్రాజెక్టు ప్రారంభానికి ముహూర్తం దాదాపుగా ఖరారైంది. ఈనెల 11న ఉదయం 9 గంటలకు కూసుమంచి మండలంలోని రావిచెట్టుతండాలో భూమిపూజ నిర్వహించేందుకు సిద్ధమైంది.

ఆగస్టు చివరి వారంలో ప్రాజెక్టును ప్రారంభించేందుకు అటు ప్రభుత్వం.. ఇటు యంత్రాంగం కసరత్తు చేస్తున్నాయి. శంకుస్థాపన చేసి ఏడాదిలోపు ప్రాజెక్టును ప్రారంభించాలనే ఆలోచనతో ప్రభుత్వం కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. విడతలవారీగా ప్రజలకు ఇంటింటికీ కనెక్షన్ ఇచ్చి సురక్షితమైన తాగునీటిని అందించాలని సంకల్పించింది. కూసుమంచి మండలాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. ముందుగా ఆగస్టు చివరినాటికి 17 తండాలకు తాగునీరు అందించనుంది.

తెలంగాణలో మహిళలు తాగునీటి కోసం మైళ్ల దూరం నడిచే దుస్థితిని మార్చాలని, ఇంటింటికీ తాగునీటిని అందించాలని సంకల్పించిన సీఎం కేసీఆర్.. మిషన్ భగీరథ పథకానికి శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా మండలంలోని జీళ్ళచెరువు గ్రామంలో 2015 సెప్టెంబర్ 20న మిషన్ భగీరథ ప్రాజెక్టు పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. అనతికాలంలోనే ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. ప్జలకు తాగునీరు అందించబోతోంది.

శరవేగంగా పనులు
పాలేరు సెగ్మెంట్‌లో మిషన్ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయి. పాలేరు జలాశయం పక్కనే నిర్మితమవుతున్న ఇన్‌టేక్‌వెల్ పనులు ఇప్పటికే 60శాతానికిపైగా పూర్తయ్యాయి. జీళ్ళచెరువు గ్రామంలో వాటర్‌ట్యాంకులు, పంప్‌హౌజ్‌ల నిర్మాణాలు 70 శాతం మేర పూర్తయ్యాయి. మిగిలిన 30శాతం పనులు మరో రెండు నెలల్లో పూర్తి కానున్నాయి. సెప్టెంబర్ చివరి నాటికి ప్రాజెక్టు పనులు పూర్తిస్థాయిలో ముగిస్తామని భగీరథ డీఈ మాణిక్యరావు తెలిపారు.

పైలట్ ప్రాజెక్టుగా కూసుమంచి
మిషన్ భగీరథ పథకానికి కూసుమంచి మండలాన్ని ప్రభుత్వం పైలట్ ప్రాజెక్టుగా ఎంపికచేసింది. ఆగస్టు చివరి వారంలో ప్రారంభించాలని అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఏదైనా కారణాల రీత్యా పనులు ఆలస్యమైతే సెప్టెంబర్ 20న (శంకుస్థాపన చేసి ఆ రోజుకు ఏడాది పూర్తవుతుంది) ప్రారంభించాలని భావిస్తున్నారు. కాగా ఈనెల 11న మండలంలోని రావిచెట్టుతండాలోని ఓ ఇంటికి నల్లా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికీ నల్లా కనెక్షన్ నిర్మాణ పనులకు భూమి పూజ చేయనున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, మిషన్ భగీరథ పథకం వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరుకానున్నారు. ఇంటింటికీ నల్లా కనెక్షన్ కోసం ట్యాంకులు, పైపులైన్ల నిర్మాణం వంటి పనులకు తొలివిడతగా 17 తండాలకు ప్రభుత్వం రూ.2.25 కోట్లు మంజూరు చేసింది.

తొలివిడతగా ఎంపికైన 17తండాలివే..
కూసుమంచి మండలంలోని గన్యతండా, రావిచెట్టుండా, లింగారంతండా, ఈజ్మీరహీరామాన్‌తండా, గంగబండతండా, బోటిమీదితండా, బురేన్‌గుట్టతండా, భగవాన్‌తండా, భగత్‌వీడుతండా, కొత్తతండా, సోమ్లతండా, ధర్మతండా, సీతితండా, మద్దివారిగూడెం, మందడినర్సాయిగూడెం, వాలుతండా, పూర్యతండాలు తొలివిడతలో ఎంపికయ్యాయి.

Leave a Reply

https://indexsy.com/