గనుల చెంత వనాలు నల్లబంగారులోకంలో విరిసిన పచ్చదనం ఈనాడు-ఈటీవీ, సింగరేణి ఆధ్వర్యంలో నాటిన 38వేల మొక్కలు
కొత్తగూడెం (సింగరేణి), న్యూస్‌టుడే: సిరులతల్లి సింగరేణి విస్తరించిన నేలలో పచ్చదనం పరుచుకొంది. కొత్తగూడెం ఏరియాలోని పీవీకే-5భూగర్భగని సమీపంలోని ప్రాంతంలో మంగళవారం ‘ఈనాడు-ఈటీవీ తెలంగాణ’, సింగరేణి సంయుక్తంగా నిర్వహించిన ‘వన భారతి-జన హారతి’లో భాగంగా వేలాది మొక్కలు నాటారు. గని కార్మికులు, అధికారులు, కార్మిక సంఘాల నాయకులు సామూహికంగా ఈ కార్యక్రమంలో పాల్గొని 30 వేల మొక్కలు నాటారు. మరో ఐదువేల మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞను నిర్వహించారు. కార్యక్రమంలో సింగరేణి డైరెక్టర్(ఆపరేషన్స్) బిక్కి రమేష్‌కుమార్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగిస్తూ సకాలంలో వర్షాలు కురవాలంటే, వాతావరణంలో భిన్నత్వం లేకుండా ఉండాలంటే, కాలాలన్నీ కాలధర్మాన్ని బట్టి మారాలంటే చెట్లు ఎంతో అవసరమన్నారు. సింగరేణి సంస్థ మొదటి నుంచి మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తోందన్నారు. గడిచిన సంవత్సరం 40 లక్షల మొక్కలను నాటిన సింగరేణి ఈ ఏడాది 50 లక్షల మొక్కలను నాటుతున్నట్లు తెలిపారు. కేవలం మొక్కలు నాటడం మాత్రమే కాకుండా మొక్కలను సంరక్షించడం కూడా అవసరమన్నారు. కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ కేవీ రమణమూర్తి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో సింగరేణి కూడా భాగస్వామ్యమవుతుందన్నారు. ‘నవ భారతి-జనహారతి’ రాష్ట్రాన్ని పచ్చదనంతో నింపుతోందన్నారు. కార్యక్రమంలో గుర్తింపు సంఘం నాయకుడు సంగెం చందర్, సింగరేణి ఎస్వోటూజీఎం షాలెంరాజు, ఏరియా ఇంజినీర్ టీవీ రావు, గుర్తింపు సంఘం నాయకులు వజ్రమ్మ, నిర్మలాదేవి, రాజయ్య, కనకరాజు, పర్యావరణ మేనేజర్ సత్యనారాయణ, సింగరేణి అటవీఅధికారి అభిలాష్, జీకే ఓసీ పీవో నారాయణరావు, భూగర్భగనుల ఏజెంట్ లలిత్‌కుమార్, పీవీకే-5మేనేజర్ శ్రీనాథ్, వీకే-7 మేనేజర్ జీపీరావు, డీజీఎం(పర్సనల్) శ్రీనివాస్, డీజీఎంలు జ్యోతి, ప్రసాద్, గోవిదప్ప, డీవైపీఎంలు కిరణ్‌బాబు, వరప్రసాద్, సంక్షేమాధికారులు అశోక్, సుజ్ఞాన్, రాము, సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్, వివిధ కార్మికసంఘాల నాయకులు పాల్గొన్నారు.