Explore Projects Across Khammam

14-06-2016-01 khammam real estate news

ఇల్లు అమ్ముతున్నారా… పన్ను పోటు తగ్గే మార్గాలివిగో..

కష్టార్జితంతో కొన్న ఇంటిని అమ్ముతున్నారా? అయితే క్యాలెండర్‌ ఒకసారి చూసుకోండి. ఇల్లు కొని కనీసం మూడేళ్లయినా పూర్తయ్యేలా వెయిట్‌ చేయండి. లేకపోతే గూబ గుయ్‌ మనేలా భారీగా పన్ను పోటు పడే ప్రమాదం ఉంది. అదెలాగో చూద్దాం…
ఎవరికీ ఏ ఆస్తి శాశ్వతం కాదు. ఏదో ఒక అవసరం కోసం ఎపుడో ఒకపుడు అమ్ముకోవాల్సి రావచ్చు. కొన్న ఇంటిని కూడా మంచి లాభం వస్తోందనీ అమ్ముకోవచ్చు. లేదా వేరే అవసరాల కోసం అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. లాభం వస్తోందని ఇల్లు అమ్ముకోవాలనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. లేకపోతే గంప లాభం చిల్లి తీసినట్టు, వచ్చిన లాభాన్ని పన్ను పోటు తన్నుకు పోయే ప్రమాదం ఉంది.

స్వల్ప, దీర్ఘకాలిక లాభాలు..

ఇంటిని కొన్న మూడేళ్లలోపు అమ్మితే వచ్చే లాభాలను ‘స్వల్పకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ లాభాలపై పన్ను భారం ఎక్కువ. వార్షిక ఆదాయం రూ.10 లక్షలు మించితే ఇల్లు అమ్మగా వచ్చిన లాభంలో 30 శాతం పన్ను కింద చెల్లించాలి.
కొన్న ఇంటిని మూడు ఆర్థిక సంవత్సరాల తర్వాత అమ్మితే వచ్చే లాభాలను దీర్ఘకాలిక మూలధన లాభాలుగా పరిగణిస్తారు. ఈ లాభాలపై 20 శాతం పన్ను చెల్లిస్తే సరిపోతుంది. ఇంకా ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని ఇండెక్సేషన్‌ లాభాలు కూడా పొంద వచ్చు. దీని వల్ల పన్ను పోటు మరింత తగ్గుతుంది. దీర్ఘ కాలిక లాభాలను లెక్కించేటపుడు ఆ ఇంటిని కొన్న తర్వాత రిపేర్లు, నవీకరణ కోసం చేసిన ఖర్చులు, కొత్త ఇల్లు నిర్మించి ఉంటే ఆ ఇంటి నిర్మాణానికి ముందు చెల్లించిన వడ్డీలను కూడా ఇంటి కొనుగోలుకు చేసిన ఖర్చుగా పరిగణించి మినహాయించుకోవచ్చు.

మినహాయింపులు…

కొన్న మూడేళ్ల తర్వాత ఇల్లు అమ్మగా వచ్చిన లాభంపై పన్ను తగ్గింపు కోరేటపుడు, ఇల్లు కొన్న సమయంలో పొందిన కొన్ని పన్ను మినహాయింపులు వదులుకోవాలి. సెక్షన్‌ 80సి కింద క్లెయిమ్‌ చేసుకున్న అసలు, స్టాంప్‌ డ్యూటీ, రిజిసే్ట్రషన్‌ ఛార్జీల మినహాయింపు వదులుకోవాలి. అలా వచ్చిన ఆదాయాన్ని ఇంటిని అమ్మిన ఆర్థిక సంవత్సరంలో వచ్చిన మొత్తం ఆదాయంలో కలిపి పన్ను చెల్లించాలి. అయితే హోమ్‌ లోన్‌పై సెక్షన్‌ 24బి కింద చెల్లించిన వడ్డీకి మాత్రం యథాతథంగా మినహాయింపు వర్తిస్తుంది.

పన్ను పోటు తగ్గేదెలా?

కొన్న మూడేళ్ల తర్వాత ఇల్లు అమ్మగా వచ్చిన మొత్తంపై పన్ను పోటు తప్పించుకునేందుకు అనేక మార్గాలున్నాయి. ఈ మొత్తంతో రెండేళ్లలో మరో ఇల్లు కొనుక్కున్నా లేదా మూడేళ్లలో కొత్త ఇల్లు కట్టుకున్నా పన్ను పోటు పడదు. ఉన్న ఇంటిని అమ్మేందుకు సంవత్సరం ముందు మరో ఇల్లు కొనుక్కుని ఉన్నా ఈ మినహాయింపు వర్తిస్తుంది. కాకపోతే ఇవన్నీ మీ పేరు మీదే జరిగి ఉండాలి. ఇల్లు కొన్నాక కూడా వచ్చిన లాభంలో కొంత మిగిలి ఉంటే ఆ మొత్తంపై దీర్ఘకాలిక మూల ధన లాభాల పన్ను చెల్లించాలి. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి. మళ్లీ కొత్తగా కొన్న ఇల్లు లేదా నిర్మించిన ఇంటిని మూడేళ్లలోపు అమ్మితే, అంతకు ముందు అమ్మిన ఇంటిపై వచ్చిన లాభాలను కూడా స్వల్ప కాలిక లాభాలుగా పరిగణించి, ఆ వ్యక్తుల ఆదాయ శ్లాబులను బట్టి అధిక పన్ను వసూలు చేస్తారు.

కొత్త ఆస్తి కొనలేకపోతే?

కొన్న ఇంటిని మూడేళ్ల తర్వాత అమ్మగా వచ్చిన దీర్ఘ కాలిక మూలధన లాభాలతో, అందరూ వెంటనే మరో ఇల్లు కొనుగోలు చేయలేరు. ఇలాంటి వారి కోసం కూడా చట్టం కొన్ని వెసులుబాట్లు కల్పించింది. ఇంటిని అమ్మిన ఆరు నెలల లోపు ఆ లాభాలను జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఎఐ) లేదా గ్రామీణ విద్యుదీకరణ సంస్థ (ఆర్‌ఇసి) జారీ చేసే బాండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేసి పన్ను మినహాయింపు పొందవచ్చు. మూడేళ్ల కాల వ్యవధి ఉండే ఈ బాండ్స్‌లో పెట్టుబడి పెట్టి సెక్షన్‌ 54 (ఇసి) కింద దీర్ఘకాలిక మూలధన లాభాలపై పన్ను మినహాయింపు ప్రయోజనం పొందొచ్చు. అయితే ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో ఈ బాండ్స్‌లో రూ.50 లక్షలకు మించి పెట్టుబడి పెట్టేందుకు అవకాశం లేదు. ఈ లాభాలను ఇంటర్‌ మినిస్టీరియల్‌ బోర్డు సర్టిఫికేషన్‌ ఉన్న టెక్నాలజీ స్టార్టప్‌ కంపెనీల్లో ఇన్వెస్ట్‌ చేసినా, పన్ను మినహాయింపు ప్రయోజనం లభిస్తుంది.

టిడిఎస్‌ సమస్య..

ప్రస్తుతం రూ.50 లక్షల కంటే ఎక్కువ విలువైన ఇంటిని కొంటుంటే, అందులో ఒక శాతం మొత్తాన్ని ముందుగానే మినహాయించి ఇన్‌కం టాక్స్‌ అధికారులకు మూలంలో పన్ను కోత (టిడిఎస్‌) కింద చెల్లించాలి. ఇంతకు ముందు ఇలాంటి కొనుగోలు లావాదేవీ జరిగిన క్యాలెండర్‌ నెల ముగిసిన వారం రోజలలోపు ఈ మొత్తాన్ని, ఇంటిని అమ్మిన వ్యక్తి తరఫున, ఐటి శాఖకు చెల్లించాలి. ఇందుకోసం అతడి పాన్‌ నంబర్‌ కోట్‌ చేస్తూ ‘ఫారం 26ఎఎ్‌స’లో ఫైల్‌ చేయాలి. ఈ నెల నుంచి ఈ గడువును 30 రోజులకు పెంచారు. ఇంటి కొనుగోలుదారుడు ఈ టిడిఎ్‌సపై క్రెడిట్‌ క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇంటిని అమ్మిన వ్యక్తి కూడా కొన్న వ్యక్తి నుంచి ఫారం 16బి తీసుకోవాలి. ఇంటిని అమ్మడం వల్ల నష్టం వచ్చినపుడు లేదా దీర్ఘకాలిక మూల ధన లాభాల నుంచి మినహాయింపు పొందాలనుకున్నా ఇంటిని అమ్మిన వ్యక్తి టిడిఎస్‌ రీఫండ్‌ కోసం క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఇందుకోసం అతడి టాక్స్‌ రిటర్న్‌లో మూల ధన లాభాల మినహాయింపు కోసం పెట్టిన పెట్టుబడుల వివరాలు తెలియజేయాలి. లేదా అసెసింగ్‌ అధికారి నుంచి సర్టిఫికెట్‌ తీసుకుని ఇంటిని కొన్న వ్యక్తికి ఇవ్వాలి.

ఇల్లు అమ్మే వారికి టిప్స్‌..

  • పాత ఇల్లు అమ్మగా వచ్చిన ధర కన్నా కొత్త ఇంటిని చౌకగా కొనుగోలు చేస్తే.. మిగిలిన మొత్తాన్ని ఆరు నెలల్లో ఆర్‌ఇసి లేదా ఎన్‌హెచ్‌ఎఐ బాండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయాలి. అలా చేయడం వల్ల సెక్షన్‌ 54 (ఇసి) కింద దీర్ఘకాలిక మూల ధన లాభాలపై విధించే పన్ను చెల్లింపు నుంచి మినహాయింపు పొందవచ్చు.
  • కొత్తగా కొన్న ఇంటిని బిల్డర్‌ మూడేళ్లలోపు అప్పగించక పోయినా, పన్ను మినహాయింపు పొందవచ్చు.
  • స్టాంప్‌ డ్యూటీ, రాష్ట్ర ప్రభుత్వ రిజిసే్ట్రషన్‌ అధికారులు నిర్ణయించే విలువ ఆధారంగా ఇంటి అమ్మకంపై ఎంత మూల ధన లాభం వచ్చిందనే విషయం నిర్ణయిస్తారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నిర్ణయించిన విలువ కంటే తక్కువ ధరకు భవనాన్ని అమ్మినట్టు చూపిస్తే ఐటి శాఖ అభ్యంతరం చెప్పే అవకాశం ఉంది.
  • ఒకవేళ ఇల్లు అమ్మగా వచ్చిన దీర్ఘకాలిక లాభాలతో అదే ఆర్థిక సంవత్సరంలో కొత్త ఇల్లు కొనలేకపోయినా, నిర్ణీత బాండ్స్‌లో ఇన్వెస్ట్‌ చేయలేక పోయినా దిగులు పడాల్సిన అవసరం లేదు. ఈ మొత్తాన్ని క్యాపిటల్‌ గెయిన్స్‌ అకౌంట్‌ స్కీమ్‌(సిజిఎఎ్‌స)లో ఇన్వెస్ట్‌ చేసి కూడా పన్ను తగ్గింపు ప్రయోజనం పొందవచ్చు.
  • ఇండెక్సేషన్‌తో తగ్గే పన్ను భారం..
  • ఒక వ్యక్తి ఒక ఇంటిని రూ.30 లక్షలకు కొని ఐదేళ్ల తర్వాత రూ.70 లక్షలకు అమ్మాడనుకుందాం. వచ్చిన రూ.40 లక్షల దీర్ఘకాలిక మూలధన లాభంపై 20 శాతం చొప్పున రూ.8 లక్షల పన్ను భారం పడుతుంది. ఇండెక్సేషన్‌, ఇతర పన్ను ప్రయోజనాలను ఉపయోగించుకుంటే ఈ భారం రూ.3.47 లక్షలకు తగ్గుతుంది. ఇలా జాగ్రత్తగా వ్యవహరిస్తే ఇంటిని అమ్మడంతో వచ్చే లాభాలపై పెద్దగా పన్ను పోటు లేకుండా తప్పించుకోవచ్చు.

Leave a Reply

https://indexsy.com/