Explore Projects Across Khammam

News Kothagudem

భద్రాచలానికి మహర్దశ

భద్రాచలానికి మహర్దశ
రామాయణ వలయంతో వినూత్న మార్పులు
కొత్త జిల్లాలో ప్రత్యేక స్థానం
భద్రాచలం, న్యూస్‌టుడే

ప్రముఖ పుణ్యక్షేత్రం భద్రాచలం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. భద్రాద్రినిమరింతగా అభివృద్ధి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి సారించడంతో ఇక్కడ వూహించని విధంగా త్వరలో అభివృద్ధి జరుగుతుందనే ప్రచారం సాగుతోంది. ఇదంతా కార్యరూపం దాల్చితే భద్రగిరి భూలోక స్వర్గంగా భక్తులకు సాక్షాత్కారం కానుంది. జిల్లాల పునర్విభజనలో భాగంగా కొత్తగూడెం(భద్రాద్రి) జిల్లా ఏర్పాటుకు కసరత్తుజరుగుతోంది. భద్రాచలం ప్రస్తుతం జిల్లా కేంద్రానికి 120కి.మీ దూరంలోఉండగా కొత్త జిల్లా ఏర్పాటు తర్వాత 40 కి.మీ దూరంలో జిల్లా కేంద్రం ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన రామాయణ వలయంలో భద్రాచలం పేరు చేర్చడంతో ఈ ప్రాంత వాసులు ఆనందోత్సాహంతో ఉన్నారు. జల రవాణాలో భద్రాచలం వరకు మార్గం ఉంటుందన్న ప్రచారం కూడా స్థానికుల్లో ఆశలు పెంచుతుంది. యాదాద్రి, వేములవాడ తరహాలో భద్రాద్రి క్షేత్ర అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం రూ. 100 కోట్లు కేటాయించింది.. పట్టణానికి కూడా వేరే నిధులు వస్తాయన్న ఆశలు ఇక్కడి వారిలో ఉన్నాయి. వీటితో ఎలాంటి పనులు చేయాలో నిర్ణయించేందుకు ప్రణాళికలు తయారు చేస్తున్నారు. స్థపతులు, ఆర్క్‌టెక్ట్‌ బృందం ఇటీవల మరోసారి క్షేత్ర పరిశీలనకు వచ్చి వెళ్లారు.

ఆశలు చిగురించేనా?..: రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ అంతటా సంబరాలు చేసుకోగా భద్రాచలం మాత్రం తీవ్రంగా నష్టపోయింది. విభజన నేపధ్యంలో కూనవరం, చింతూరు, వరరామచంద్రాపురం మండలాలు పూర్తిగా ఏపీలోని తూర్పుగోదావరిలో కలిశాయి. భద్రాచలం రెవెన్యూ గ్రామం మినహా భద్రాచలం మండలంలోని 21 గ్రామ పంచాయతీలు అదే జిల్లాలో విలీనమయ్యాయి. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు పూర్తిగా బూర్గంపాడు మండలం పాక్షికంగా ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాలో కలిశాయి. ఈ మండలాలు ఇంతకు ముందు భద్రాచలం ఐటీడీఏ పరిధిలో ఉండేవి. ప్రస్తుతం కొత్త జిల్లాల ప్రస్థావన వస్తున్న నేపధ్యంలో భద్రాచలం పేరు కూడా జోరుగా వినిపించింది. గతంలో ప్రభుత్వ పెద్దలు ఇచ్చిన హామీలతోపాటు ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టత దృష్ట్యా ఆ మండలాలు విడిపోకుండా ఉంటే భద్రాలం జిల్లా అయ్యేదన్న వాదనలు బలంగానే వినిపించాయి. ఎన్నో సమీకరణాలను పరిగణలోకి తీసుకుని భద్రాద్రి జిల్లా పేరిట కొత్తగూడెం కేంద్రంగా జిల్లాను ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలా కోలుకోలేని నష్టాలను భరించిన భద్రాచలానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేసే అభివృద్ధిపైనే స్థానికులు ఆశలు పెంచుకున్నారు.

రామాయణ వలయం ఇలా..: తెలంగాణ సహా ఆరు రాష్ట్రాల్లో 11 పర్యాటక ప్రాంతాలను రామాయణ వలయం పేరిట అభివృద్ధి చేసేందుకు జాతీయ కమిటీలు ఇటీవలే ప్రతిపాదించాయి. కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సానుకూలంగా స్పందించింది. కేంద్ర పర్యాటకశాఖ మంత్రి మహేశ్‌శర్మ నేతృత్వంలో తయారైన ప్రతిపాదనల్లో భద్రాచలం పేరుంది. రామాయణ కాలంలో రాముడు తిరిగిన ప్రాంతాన్ని ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు రూ.వందల కోట్లను కేటాయించే వీలున్నట్లు వినికిడి. అయోధ్య, నందిగ్రామ్‌, శ్రింగవర్‌పూర్‌, చిత్రకూట్‌(ఉత్తరప్రదేశ్‌), సీతామడీ, బక్సార్‌, దర్భంగా(బీహార్‌), జగదల్‌పూర్‌(ఛత్తీస్‌గఢ్‌), హంపి(కర్ణాటక), రామేశ్వరం(తమిళనాడు)తోపాటు రాష్ట్రంలోని భద్రాచలంను కలుపుతూ రామాయణ వలయాన్ని ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

రైల్వేలైన్‌ ఏర్పాటుతో..: బూర్గంపాడు మండలం పాండురంగాపురం నుంచి సారపాకకు రైల్వేలైను పొడగించేందుకు రూ.120 కోట్లు ఖర్చవుతుందని ఇంతకు ముందు అంచనాలు వేశారు. దీన్ని గోదావరి పైనుంచి భద్రాచలం వరకు పొడిగిస్తే మరో రూ.200 కోట్ల వరకు అవుతుందని అనుకుంటున్నారు. ఈ నిధుల్ని కేంద్రం కేటాయిస్తే రామాయణ వలయానికి సార్థకత లభిస్తుందని భక్తులు అంటున్నారు. ఇదే జరిగితే పుణ్యక్షేత్రానికి భక్తుల రాకపోకలు ఇంకా పెరుగుతాయి.

ఆధ్యాత్మిక సంబరమే: రూ.100 కోట్లతో రామాలయం అభివృద్ధి చేస్తామని సీఎం కేసీఆర్‌ప్రకటించిన నేపథ్యంలో వాస్తు శిల్పి, స్థపతి పరిశీలన చేశారు. మళ్లీ నేడోరేపో పరిశీలన చేయనున్నారు. విశాలమైన ప్రాంగణంలో ప్రశాంతమైనపరిస్థితులు కల్పించి మరింత ఆధ్యాత్మికతను అందించేలా కొత్త నిర్మాణాలు చేయదలిచారు. మాడవీధులను విస్తరించనున్నారు. అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించాల్సి వస్తుంది. రంగనాయకుల గుట్టపై కొత్తగా కాటేజీలను నిర్మించి శిథిలావస్థలో ఉన్న వాటిని తొలగించే వీలుంది.

పర్ణశాలపై దృష్టి..: రామాలయానికి అనుబంధంగా ఉన్న పర్ణశాల అభివృద్ధిపై కూడా ఆలయ కమిటీ దృష్టి సారించింది. రూ.కోటికి పైగా ఆదాయం ఉన్న ఈఆలయానికి అనుబంధంగా వసతి ఏర్పాట్లు చేయనున్నారు. గోదావరిపై రూ.170 కోట్లతో వంతెన నిర్మాణం త్వరలో జరిగే వీలుంది. రూ.20 కోట్లతో గతంలో ప్రతిపాదించిన రామాయణ థీమ్‌పార్కు పర్ణశాలలో నిర్మించేందుకు కసరత్తు జరుగుతోంది. బ్రిటీష్‌ కాలంలో దుమ్ముగూడెం వరకు నావిగేషన్‌ కెనాల్‌ ఉన్నందున మళ్లీ దీన్ని పునరుద్ధరిస్తే ఈ ప్రాంతంలో ఎంతోమందికి ఉపాధి ఖాయం. మొత్తంగా ఆలయ ఆధారిత అభివృద్ధి జరుగుతుందన్న ప్రచారం జోరుగా సాగుతోంది.

ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు
తాళ్లూరి రమేష్‌బాబు, ఈవో
భద్రాద్రి రామాలయానికి ప్రభుత్వం రూ.100 కోట్లు కేటాయించి ఆలయ అభివృద్ధిని ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. మాడవీధులకు అడ్డుగా ఉన్న ఇళ్ల యజమానులతో చర్చలు ఆశాజనకంగా జరిగాయి. స్థల సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నాం. మాడవీధులకు సమీపంలో కూలిన గోడను తొలగించి త్వరలోనే పటిష్ట నిర్మాణం చేపట్టనున్నాం.

ఇంకా అభివృద్ధి జరగాలి
ప్రసాద్‌, మచిలీపట్నం
గతంతో పోల్చితే రామాలయంలో చాలా మార్పులు వచ్చినప్పటికీ ఇంకా అభివృద్ధి జరగాల్సి ఉంది. వర్షం వచ్చినా భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలి. ఎటు చూసినా ఆధ్యాత్మికత కనిపించేలా నిర్మాణ పనులు జరగాలి.

రైలు సౌకర్యం ఉంటే బాగు
జ్యోతిరాణి, నిజామాబాద్‌
మిగతా ఆలయాలకు వెళ్లేందుకు రైలు సౌకర్యం ఉంది. ఇక్కడ కూడా భక్తుల రద్దీ పెరగాలంటే రైలు మార్గాన్ని ఏర్పాటు చేయాలి. ఇదే జరిగితే ఆలయానికి ఆదాయం పెరుగుతుంది. ఆలయ ఆధారిత అభివృద్ధితోఉపాధి అవకాశాలు మెరుగవుతాయి.

https://indexsy.com/