Explore Projects Across Khammam

khammam real estate slider

అభివృద్ధి పథంలో కొత్తగూడెం మున్సిపాలిటీ

-రెండేళ్ల పాలనలో రూ.15కోట్ల పనులు పూర్తి
-మరో రూ.47కోట్ల పనులకు ప్రతిపాదనలు
-వార్డు వార్డుకు సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం
కొత్తగూడెం అర్బన్ : అభివృద్ధి అంటే కేవలం కాగితాల్లో మాత్రమే చూపెట్టారు గత పాలకులు. ఒక్క సీసీ రోడ్డు వేస్తే అదేదో తమ ఘనతనే అన్నట్లుగా దశాబ్ధకాలంగా ప్రచారం చేసుకొని ఓట్లు దండుకున్నారు. కానీ ఒక్క సీసీ రోడ్డు కాదు… ఇప్పుడు ప్రతి గల్లీలో సీసీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టు, మంచినీటి సరఫరా తదితర పనులను పక్కాగా చేపట్టి ప్రజల ముఖాల్లో సంతోషాలు నింపుతోంది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. రాష్ట్రంలో కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకటరావు నాయకత్వంలో జిల్లాలో కొత్తగూడెం మున్సిపాలిటీ పీఠాన్ని టీఆర్‌ఎస్ దక్కించుకోవడంలో చక్రం తిప్పారు.

మున్సిపాలిటీ కౌన్సిల్ ఏర్పడిన నాటి నుంచి కేవలం అభివృద్ధే మంత్రంగా మున్సిపల్ చైర్‌పర్సన్ పులిగీత, కౌన్సిలర్లతో ఎప్పటికప్పుడు సమావేశాలు నిర్వహిస్తూ ఎమ్మెల్యే అభివృద్ధి పనులను చేపడుతున్నారు. శంకుస్థాపనలు ఉండవు.. కేవలం ప్రారంభోత్సవాలు మాత్రమే ఉంటాయని మరీ ప్రకటించి అందుకు అనుగుణంగా పనిచేస్తూ, కౌన్సిలర్లను పనిచేయిస్తున్నారు.

కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధి పథంలో దూసుకుపోతోంది. మునుపెన్నడూ లేని రీతిలో గత రెండేళ్లకాలంలో సుమారు రూ.15కోట్ల పనులను చేపట్టారు. ప్రస్తుతం మరో రూ.47కోట్ల పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. మరి కొద్దిరోజుల్లో ఈ ప్రతిపాదన పనులకు సైతం ఉన్నతాధికారుల నుంచి ఆమోదం లభించనుంది. పట్టణంలోని 33వార్డుల్లో తొలిదశలో అంతగా అభివృద్ధి చెందని వార్డులపై ప్రత్యేక దృష్టి సారించి వాటికి అత్యధికంగా నిధులు కేటాయించారు.

వార్డుల్లో సీసీ రోడ్లు, అవసరమైన చోట బీటీ రోడ్లు, డ్రైన్లు, కల్వర్టులు, కమ్యూనిటీహాల్స్, కిన్నెరసానీ పైపులైన్ మరమ్మతులు తదితర నిర్మాణంపై దృష్టిసారించారు. పట్టణ ప్రజలకు ఏయే వసతులు, సౌకర్యాలు అవసరమో మున్సిపల్ చైర్‌పర్సన్ పులిగీత, ఇతర కౌన్సిలర్లతో మాట్లాడి అందుకనుగుణంగా నిధులు తెచ్చి అభివృద్ధి చేయడంతో సఫలీకృతులయ్యారు. ఆదర్శ మున్సిపాలిటీగా కొత్తగూడెంను తీర్చిదిద్దేందుకు అందరూ కలిసి పనిచేయాలని మరీ చెప్పి వారితో పనులు చేయిస్తున్నారు. ఆదాయాన్ని పెంచుకునే మార్గాలపై దృష్టి సారించాలని సైతం కౌన్సిలర్లకు సూచిస్తూ భేషజాలకు వెళ్ళకుండా కొత్తగూడెం మున్సిపాలిటీ అభివృద్ధే ధ్యేయంగా ఈ రెండేళ్ళలో పనిచేశారు.

ఎన్నో ఏళ్లుగా నోచుకోని సమస్యలకు ఈ రెండేళ్లలో మోక్షం..
ఉమ్మడి రాష్ట్రంలో రెండు కౌన్సిల్‌లో సైతం పరిష్కారం కానీ అనేక సమస్యలకు నూతనంగా తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన టీఆర్‌ఎస్ కౌన్సిల్ పరిష్కారంచూపింది. వార్డు ప్రజలు అధికారులకు అనేక వినతిపత్రాలు ఇచ్చిన పట్టించుకోనివాటిని ప్రస్తుత కౌన్సిల్ ప్రజల సమస్యలను తెలుసుకొని వారికి అవసరమైన చోట నిధులు కేటాయించి సీసీ రోడ్లు, డ్రైన్లు, ప్రధానరోడ్ల వెంట ఎల్‌ఈడీ లైట్లను ఏర్పాటు చర్యలు చేపట్టారు.

అభివృద్ధి అంతా ఒకే దగ్గర కేంద్రీకృతం కాకుండా భిన్నంగా ఆలోచించి ప్రజలకు అవసరమైన చోట రైతుబజార్లు, అందరికి అందుబాటులో ఉండేలా షిఫ్ మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్‌లు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. కేవలం రెండేళ్ళలోనే కోట్లాది రూపాయలతో పట్టణాన్ని అన్నీ రంగాల్లో అభివృద్ధి చేసేలా ప్రతిపాదనలు సిద్ధం చేశారు.

ఈ రెండేళ్లలో మున్సిపాలిటీ అభివృద్ధికి కేటాయించిన నిధుల వివరాలు…
– స్టేట్ ఫైనాన్స్ రూ.75లక్షలు, మన వార్డు-మన ప్రణాళిక రూ. 60.51లక్షలు
– నాన్‌ప్లాన్ గ్రాంట్ (2014-15) రూ. 86లక్షలు, 2015-16లో రూ.19లక్షలు 89వేలు, 13వ ఫైనాన్స్ కమిషన్ నిధులు రూ. 5కోట్ల 13లక్షల 71వేలు.
– 14వ ఫైనాన్స్ కమిషన్ రూ. 5కోట్ల 15లక్షల 89వేలు, ఏసీడీపీ 2014-15 రూ.20లక్షలు, ఏఎస్‌సీ నిధులు రూ. 2014-15 రూ. 20లక్షలు, ఎస్సీ సబ్‌ప్లాన్ 2015-16 నిధులు రూ. ఒక కోటి 10లక్షల 68వేలు, ట్రైబల్ సబ్‌ప్లాన్ 2015-16 రూ.94లక్షల 16వేలతో సీసీ.రోడ్లు, డ్రైన్లు, కల్వర్లు, మంచినీటిసరఫరా పైపులైన్ మరమ్మతులు తదితరాలు చేపట్టారు.
– ప్రతిపాదనలు –
– కిన్నెరసాని నీటి సరఫరాకు కొత్త పైపులైన్ నిర్మాణం రూ.44కోట్ల 91లక్షలు,
– నేషనల్ ఫిషరీస్ డెవలప్‌మెంట్ బోర్డు నుంచి చేపల మార్కెట్ నిర్మాణం కోసం రూ.2 కోట్ల 4లక్షల 72వేలు, నాన్‌ప్లాన్ గ్రాంట్ 2015-16 సంవత్సరానికీ సీసీ డ్రైన్లు రూ.49లక్షల 69వేలు,
– స్టేట్ ఫైనాన్స్ కమిషన్ రూ.6లక్షల 6వేలు వివిధ పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి ఉన్నతాధికారుల ఆమోదం కోసం పంపారు.

ఆదర్శ కొత్తగూడెంగా చేయడమే లక్ష్యం : పులి గీత, మున్సిపల్ చైర్‌పర్సన్
రాష్ట్రంలోనే కొత్తగూడెంను ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దేందుకు ఎమ్మెల్యే జలగం వెంకటరావు నాయకత్వంలో కౌన్సిల్ సభ్యులమంతా కలిసి పనిచేస్తున్నాం. ప్రజలకు అవసరమైన మౌళిక వసతులు, సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నాం. ఇప్పటికే ప్రతి వార్డుల్లో ప్రజలకు అవసరమైన పనులు చేపట్టాం. రైతుబజార్లు, ఫిష్ మార్కెట్, ఫ్రూట్స్ మార్కెట్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. కొద్దిరోజుల్లోనే ఆ పనులు సైతం ప్రారంభిస్తాం. ప్రజల సహకారంతో పట్టణాన్ని మరింత అభివృద్ధి చేస్తాం.

https://indexsy.com/