హరితహారానికి 50లక్షల మొక్కలు సిద్ధం నాలుగు జిల్లాల్లో ఇప్పటివరకు 1.71కోట్ల మొక్కలు
కొత్తగూడెం (సింగరేణి), న్యూస్‌టుడే: సింగరేణి విస్తరించిన నాలుగుజిల్లాల్లో హరితహారం కింద 50లక్షల మొక్కలను సిద్దంచేసినట్లు సింగరేణి డైరెక్టర్(ప్రాజెక్టు,ప్లానింగ్) అడిక మనోహర్‌రావు తెలిపారు. సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రధాన నర్సరీని ఆయన మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో హరితహారం కింద 50లక్షల మొక్కలను నాటేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. మొత్తం 1369 హెక్టార్ల విస్తీర్ణంలో ఒక్కో జిల్లాలో సుమారు పదిలక్షల మొక్కలను నాటేందుకు లక్ష్యంగా పెట్టుకొన్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 9302 హెక్టార్ల విస్తీర్ణంలో 1.71కోట్ల మొక్కలను పెంచినట్లు ఆయన తెలిపారు. కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారం ఓవర్‌బర్డెన్ డంపులపై భారీ ఎత్తున మొక్కలు నాటుతున్నట్లు వివరించారు. సామాజిక బాధ్యత నిర్వహణలో భాగంగా పరిసర, ప్రభావిత గ్రామాల్లో మొక్కలను పెంచడంతోపాటు గ్రామస్థులకు పంపిణీ చేస్తున్నామన్నారు. సింగరేణి వ్యాప్తంగా 11 ఏరియాల్లో 11 నర్సరీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన నర్సరీ ఆవరణలో మొక్కలు నాటారు. జీఎం(ప్లానింగ్, ప్రాజెక్టు) కిషన్‌రావు, ఎస్వోటూ డైరెక్టర్ విజయబాబు, అటవీ శాఖాధికారి అభిలాష్ పాల్గొన్నారు.