డెయిరీని లాభాల బాట పట్టిస్తాం కొత్తగా పాలసేకరణ కేంద్రాల ఏర్పాటు ఉత్పత్తిదారుల సహకార సంఘాలకు రిజిస్ట్రేషన్ విజయ డెయిరీ ఇంఛార్జి ఉప సంచాలకులు శ్రావణ్‌కుమార్
ఖమ్మం వ్యవసాయం, న్యూస్‌టుడే: ఖమ్మం విజయ డెయిరీని లాభాల బాటలో నడపడానికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని డెయిరీ ఇంఛార్జి ఉప సంచాలకులు డాక్టర్ కె.శ్రావణ్‌కుమార్ అన్నారు. మంగళవారం ఆయన కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా డెయిరీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. తాను వరంగల్ జిల్లాలో డెయిరీ మేనేజర్‌గా పనిచేస్తూ ఇక్కడికి బదిలీపై వచ్చినట్లు తెలిపారు. జిల్లాలో మొత్తం 8 బల్క్‌మిల్క్ శీతలీకరణ కేంద్రాలు ఉన్నాయని వీటిలో రెడ్డిపాలెం కేంద్రం పని చేయటం లేదని అన్నారు. ఐటీడీఏ అధికారులతో, డీఆర్‌డీఏ అధికారులతో మాట్లాడి త్వరలో దీన్ని తిరిగి ప్రారంభించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా రోజుకు 7,500 లీటర్ల పాల సేకరణ జరుగుతోందని, హుజూర్‌నగర్ నుంచి 1200 లీటర్లు, నల్లగొండ జిల్లా తిప్పర్తి నుంచి 1200 లీటర్లు ఇక్కడకు వస్తున్నాయని వివరించారు. రోజుకు 6 వేల లీటర్ల పాల విక్రయాలు జరుగుతున్నాయని, ఇక్కడి నుంచి ప్రతిరోజు 5 వేల లీటర్ల పాలను హైదరాబాద్‌కు పంపుతున్నామని తెలిపారు. పాల సేకరణలో తెలంగాణలోనే జిల్లా చాలా వెనుకబడి ఉందన్నారు. రోజుకు కనీసం 25 వేల లీటర్ల పాల సేకరణ లక్ష్యంగా పెట్టుకున్నామని, అన్ని పాల సేకరణ కేంద్రాల్లో నాణ్యమైన పాలను సేకరిస్తున్నామని తెలిపారు. కొత్త గ్రామాల్లో కూడా సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 280 సేకరణ కేంద్రాలు ఉండగా వీటి సంఖ్యను 600 వరకు పెంచటానికి ప్రయత్నిస్తున్నామని శ్రావణ్‌కుమార్ చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం లీటరుకు రూ.4 చొప్పున ప్రోత్సాహకం ఇస్తోందని దీనికి సంబంధించిన రూ.33 లక్షలను త్వరలోనే రైతుల ఖాతాలో జమ చేస్తామని అన్నారు. పాల అమ్మకాలను పెంచి తద్వారా డెయిరీని లాభాల్లోకి తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. రైతులకు రాయితీపై పశువుల దాణా, గడ్డి గింజలు కూడా సరఫరా చేస్తామని, పశువులకు ఆరోగ్య శిబిరాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు. ఇందుకు పశుసంవర్ధక శాఖ, డీఆర్‌డీఏ సహకారం కూడా తీసుకుంటామని చెప్పారు. కొత్తగా ఏర్పాటు చేసే పాల సేకరణ కేంద్రాల్లో ఐకేపీ మహిళలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వివరించారు. ప్రైవేటు డెయిరీల ధాటిని తట్టుకోవడానికి 1964 సహకార చట్టం ద్వారా జిల్లాలోని పాల ఉత్పత్తి సహకార సంఘాలను కూడా రిజిస్ట్రేషన్ చేస్తామని, తొలి విడతలో 60 సంఘాలను గుర్తించినట్లు చెప్పారు. డెయిరీలో పాల అనుబంధంగా ఉత్పత్తి అయిన పెరుగును త్వరలో ఇక్కడే తయారు చేస్తామని చెప్పారు. ప్రస్తుతం డెయిరీ సామర్థ్యం రోజుకు 20 వేల లీటర్లు కాగా దీన్ని 40 వేల లీటర్లకు పెంచాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపినట్లు చెప్పారు. ఇందు కోసం అనుమతి కూడా లభించిందని వివరించారు.