20 లక్షల మొక్కలు నాటేందుకు కృషి ఇల్లెందు పర్యటనలో డీఎఫ్‌వో ఎస్.శాంతారాం
ఇల్లెందు గ్రామీణం, న్యూస్‌టుడే: హరితహారంలో భాగంగా అడవులను పెంచేందుకు కొత్తగూడెం డివిజన్ పరిధిలో 20 లక్షల మొక్కలను నాటి వాటిని సంరక్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనున్నట్లు డీఎఫ్‌వో ఎస్.శాంతారాం పేర్కొన్నారు. స్థానిక అటవీశాఖ కార్యాలయంలో సోమవారం ఏర్పాటైన అటవీ అధికారుల సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇల్లెందు సబ్ డివిజన్‌లో 500 హెక్టర్లల్లో 10 లక్షల మొక్కలు నాటేందుకు ఇప్పటికే శాఖ సిబ్బంది భూములను గుర్తించి సిద్ధం చేస్తున్నట్లు వివరించారు. కొత్తగూడెం డివిజన్ పరిధిలో 700 హెక్టార్లల్లో అటవీ భూమిని ఆక్రమణదారులు 2006 తర్వాత పోడు చేసినట్లు గుర్తించామని పేర్కొన్నారు. డివిజన్ పరిధిలోని నర్సరీల్లో మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. తాటి మొక్కలను వచ్చే సంవత్సరం నుంచి అటవీశాఖ ఆధ్వర్యంలో నర్సరీల ద్వారా అభివృద్ధి చేసి వాటిని కూడా రైతులకు పంపిణీ చేయడంతో పాటు అడవుల్లో పెంచుతామని పేర్కొన్నారు. సబ్ డివిజన్‌ల్లో నకిలీ పట్టాలు 7 వేలకు పైగా ఉన్నట్లు గుర్తించామని ఆగస్టులో వాటిపై ప్రత్యేక శ్రద్ధతో ఆపరేషన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అడవులను సంరక్షించేందుకు ప్రతీ ఒక్కరు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఇల్లెందు, కొమరారం ఇంఛార్జి ఎఫ్‌ఆర్‌వో కుమార్‌రావు, అటవీశాఖాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.