Explore Projects Across Khammam

27-06-16-01 khammamrealestate news

పేద విద్యార్థుల్లో విద్యా‘జ్యోతి’

పేద విద్యార్థుల్లో విద్యా‘జ్యోతి’
ఎనిమిదేళ్లలో రూ.కోటిన్నరకు పైగా వ్యయం
ఏటా రాతపుస్తకాలు పంచుతున్న ఐటీసీ
బూర్గంపాడు, న్యూస్‌టుడే

 

పేద విద్యార్థుల జీవితాల్లో ఐటీసీ-పీఎస్‌పీడీ విద్యాజ్యోతి పథకం వెలుగులు నింపుతోంది. జీవితాలను మెరుగు పరిచే విద్యాభ్యాసం నుంచి నిరుపేద విద్యార్థులు దూరం కాకుండా చూసేందుకు ఐటీసీ-పీఎస్‌పీడీ యాజమాన్యం ఏటా సాయం చేస్తోంది. ఎనిమిదేళ్ల నుంచి ఆ సంస్థ విద్యాజ్యోతి పథకం అమలు చేస్తోంది. ఈ కాలంలో ఐటీసీ యాజమాన్యం బూర్గంపాడు మండలంలోనే రూ.కోటిన్నర పైగా విలువైన రాతపుస్తకాలు పంచిపెట్టింది. ఈ పథకాన్ని మున్ముందు ఇంకా విస్తరించేందుకు సిద్ధమవుతోంది.

అన్ని పాఠశాలలకూ విస్తరించిన సేవలు
సారపాకలోని ఐటీసీ-పీఎస్‌పీడీ సంస్థ యాజమాన్యం 2008లో విద్యాజ్యోతి పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం కింద తొలుత సారపాకలోని ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా రాతపుస్తకాలు పంచిపెట్టేవారు. ఆరంభంలో ఈ పథకం సారపాక గ్రామ పంచాయతీ వరకే పరిమితం చేశారు. ఆ తర్వాత రెండేళ్లకే మండలంలోని అన్ని పాఠశాలలకు విస్తరించారు. ప్రస్తుతం విద్యాజ్యోతి కింద 13వేల మంది విద్యార్థులకు 1.60లక్షల రాతపుస్తకాలు ఉచితంగా అందుతున్నాయి. అంటే దాదాపు రూ.35లక్షలకు పైగా విలువైన పుస్తకాలు చిన్నారులకు పంచుతున్నారు. ఎనిమిదేళ్ల క్రితం ఐటీసీ-పీఎస్‌పీడీ సీఈవో సంజయ్‌కుమార్‌సింగ్‌ ప్రారంభించిన ఈ పథకం సంస్థ ఉన్నతాధికారులు కె.నాగహరి, సీహెచ్‌.విజయసారథి, ప్రస్తుత సారపాక యూనిట్‌హెడ్‌గా ఉన్న మకరంద్‌, డీజీఎం ప్రభోద్‌కుమార్‌పాత్రో తదితర ఉన్నతాధికారుల చొరవతో నేటి వరకు నిరాటంకంగా కొనసాగుతూ వస్తోంది. ఈ ఏడాది ప్రస్తుతం రాతపుస్తకాల పంపిణీ కొనసాగుతోంది.

నాణ్యమైన రాతపుస్తకాలిస్తున్నారు
మాళొతు మౌనిక, 9వ తరగతి, ఆశ్రమ పాఠశాల, బూర్గంపాడు
ఐటీసీ సంస్థ నుంచి మాకు నాణ్యమైన రాతపుస్తకాలు ఉచితంగా అందుతూ ఉన్నాయి. నేను ఇక్కడ ఆరో తరగతి చదువుతున్న నాటి నుంచి వీటిని పొందుతున్నా. ఇలాంటి అవకాశం మరెక్కడా ఉండదు. ఇలాంటి రాతపుస్తకాలు ఇస్తున్నందున మాకు ఉపయోగకరంగా ఉన్నాయి. మా సొంతూరు కారుకొండరామవరంలో నాతోటివారంతా రూ.10 విలువైన రఫ్‌ పుస్తకాలపైనే రాసుకుంటున్నారు.

ఆరేళ్లుగా పొందుతున్నా: పర్శిక శ్రీలక్ష్మి, విద్యార్థిని, ఆశ్రమ పాఠశాల, బూర్గంపాడు
మాలాంటి వాళ్లకు ఇంత మంచి రాతపుస్తకాలు కొనుక్కోవాలంటే చాలా భారం. ప్రభుత్వం ఇచ్చే పుస్తకాలు సరిపోవు. ఐటీసీ వారు ఒక్కొక్కరికి ఇస్తున్న రాత పుస్తకాల విలువ రూ.450 దాకా ఉంటుంది. నాణ్యమైన పుస్తకాలు ఇస్తుండటంతో ఆసక్తికరంగా రాసుకోగలుగుతున్నా. మా వూరు కొత్తగుండాలపాడు. నా తోటి విద్యార్థులకు లేని ఈ అవకాశం నాకు దక్కడం అదృష్టం. ఐటీసీ సంస్థకు ధన్యవాదాలు.

https://indexsy.com/