Explore Projects Across Khammam

realestate news

రేపటినుంచి హరితోద్యమం..

ఖమ్మంసిటీ ;తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న హరితహారం కార్యక్రమం జిల్లాలో రేపటినుంచి 15 రోజుల పాటు ఉద్యమంలా కొనసాగనుంది. ఉన్నతాధికారి నుంచి కిందిస్థాయి ఉద్యోగి వరకు ఈ కార్యక్రమంలో భాగం పంచుకోనున్నారు. పర్యావరణ పరిరక్షణ, వాతావరణ సమతుల్యత ధ్యేయంగా భావితరాలకు బంగారు భవిష్యత్‌ను అందించే లక్ష్యంతో సర్కార్ చేపడుతున్న ఈ హరితహారానికి.. జిల్లావ్యాప్తంగా 232 నర్సరీల్లో వివిధ రకాలైన 4 కోట్ల మొక్కలు సిద్ధం చేశారు అధికారులు. ప్రజాప్రతినిధులు, ప్రజల భాగస్వామ్యంతో ఊరూరా పండుగ వాతావరణాన్ని తలపించే విధంగా విజయవంతం చేసేందుకు కలెక్టర్ లోకేష్‌కుమార్ ఇప్పటికే అధికారయంత్రాంగాన్ని సిద్ధం చేశారు.

తెలంగాణలో మరో ఉద్యమం ఆసన్నమైంది. రెండేళ్ల క్రితం వరకు ఉవ్వెత్తున కొనసాగిన తెలంగాణ ఉద్యమం మాదిరిగానే మన రాష్ట్రంలో తెలంగాణకు హరితహారం ప్రారంభానికి మరో 24గంటల సమయం ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి నుంచి గ్రామ పంచాయతీ సర్పంచ్ వరకు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నుంచి అటెండర్ వరకు ఈ ఉద్యమంలో పాలుపంచుకుంటున్నారు. వాతావరణ సమతుల్యత రక్షణే ధ్యేయంగా భావితరాలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ప్రభుత్వం కృషిచేస్తుంది.

దీనిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 4కోట్ల మొక్కలను నాటేందుకు అధికార యంత్రాంగం ప్రణాళికను రూపొందించింది.ప్రజాప్రతినిధులు,ప్రజల భాగస్వామ్యం.. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు కృషిచేస్తున్నారు. ఇప్పటికే డీఎస్ లోకేష్‌కుమార్ ఆధ్వర్యంలో అధికార యంత్రాంగానికి పలు సూచనలు, సలహాలు అందజేశారు.

హరితహారానికి ప్రణాళిక సిద్ధ్దం..
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరితహారం కార్యక్రమం అమలుకు జిల్లా యంత్రాంగం సన్నద్ధమైంది. నియోజకవర్గానికి 30లక్షల మొక్కలు పెంచేలా ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రతిరోజు ప్రజలకు అవసరం వచ్చే మొక్కలతో పాటు పండ్లు, టేకు, ఉసిరి తదితర మొక్కలు పెంచేందుకు సన్నద్ధమైంది. టెరిటోరియల్, డీఎఫ్‌ఓ డీఆర్‌డీఏ, సింగరేణి, పరిశ్రమశాఖ, భద్రాచలం ఐటీడీఏ, ఐబీసీ నర్సరీలనుపెంచారు. చెరువులు, ప్రభుత్వ భూముల్లో మొక్కలను నాటడంతో పాటు ప్రతి ఇంటికి ఐదు మొక్కలను ఇవ్వనున్నారు. ఇందులో పండ్ల మొక్కలు, కరివేపాకు, బొప్పాయి, ఈ ఏడాది పంపిణీ చేయనున్న 3.5కోట్ల మొక్కల్లో ఖమ్మం సోషల్ ఫారెస్ట్ 35లక్షల మొక్కలను పెంచేందుకు ప్రణాళికలను రూపొందించింది.

ఖమ్మం టెరిటోరియల్ ఆధ్వర్యంలో 8 లక్షల మొక్కలు, టెడిటోరియల్ 6లక్షల మొక్కలు, పాల్వంచ టెడిటోరియల్ ఆధ్వర్యంలో 6లక్షలు, భద్రాచలం డివిజన్ ఆధ్వర్యంలో 7లక్షల మొక్కలు సిద్ధంగా ఉంచారు. అదేవిధంగా ఐటీడీఏ ఆధ్వర్యంలో 7లక్షలు, డ్వామా ఆధ్వర్యంలో 25 లక్షలు డీఆర్‌డీఏ ఆధ్వర్యంలో 5 లక్షలు, హార్టికల్చర్ ఆధ్వర్యంలో 8 లక్షలు, పట్టుపరిశ్రమ శాఖ ఆధ్వర్యంలో 12 లక్షలు, ఎస్‌సీసీఎల్ ఆధ్వర్యంలో 20 లక్షలు, ఎఫ్‌డీసీ ఆధ్వర్యంలో 8 లక్షలు, ఆధ్వర్యంలో మొక్కలు సిద్ధంగా 3కోట్ల మొక్కలను నాటగా ఇప్పటివరకు 2.31కోట్ల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. వీటితో పాటు గత ఏడాది ఎండిపోయిన కోటి మొక్కల స్థానంలో కోటి మొక్కలను పెంచారు. మొత్తం 4 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉంచినప్పటికీ జిల్లాలో 3.5కోట్ల మాత్రమే అవసరమయ్యే అవకాశముంది.

అధికారులు.., ప్రజలు.. ప్రజాప్రతినిధులు..
తెలంగాణాకు హరితహారం కార్యక్రమంలో ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం పెంచేందుకు అధికారులు కృషి చేస్తున్నారు. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లాలో హరితహారం కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలోని ఇద్దరు ఎంపీలైన పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతారాంనాయక్‌లు హరితహారం కార్యక్రమంలో పాల్గొననున్నారు. జడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత గత వారంరోజలు నుంచి హరితహార కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

ఖమ్మం, కొత్తగూడెం ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, జలగం వెంకటరావు ఇప్పటికే ఈ కార్యక్రమంలో విస్తృతంగా పాల్గొంటున్నారు. అదేవిధంగా వైరా, ఇల్లెందు, అశ్వారావుపేట, పినపాక ఎమ్మెల్యేలు మదన్‌లాల్, కోరం కనకయ్య, తాటి వెంకటేశ్వర్లు, పాయం వెంకటేశ్వర్లు ఆయా నియోజకవర్గాల్లో జరిగే హరితహారం కార్యక్రమంలో పాల్గొననున్నారు.వీరితో పాటు ఆయా మండల జడ్పీటీసీలు,ఎంపీపీలు,మార్కెట్ కమిటీ చైర్మన్లు, డీసీసీబీ చైర్మన్, సహకార సంఘాల చైర్మన్లు, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, వార్డు సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.

అసలు పరిస్థితి ఏంటంటే..?!
రోజురోజుకూ చెట్లు, అడవులు అంతరించడం వల్ల మానవాళి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. అడవుల క్షీణత, చెట్లు లేకపోవడం వల్ల భూమికోత, అకాల వర్షాలు, వరదలు, పంటలకు నష్టం, కరవు కాటకాలు, వ్యవసాయ ఉత్పత్తుల క్షీణత వంటి దుష్ప్రరిణామాలు ప్రజలకు అష్టకష్టాలు తెచ్చిపెడుతున్నాయి. ప్రధానంగా పచ్చదనం కరవైన కారణంగా వాతావరణ కాలుష్యం పెరిగి ప్రజల ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపుతోంది. వాతావరణం సమతుల్యంగా ఉండాలంటే పచ్చదనం 33శాతం ఉండాలి. ప్రస్తుతం రాష్ట్రంలో 23శాతం మాత్రమే ఉంది.

ఇంకా ఏం జరుగుతుందంటే..?!
ప్రస్తుతం కలుషిత వాతావరణంలో మనిషి ఆయుష్షు నానాటికీ తగ్గిపోతోంది. అతివృష్టి, అనావృష్టి మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. కాలుష్యకారకాలు సమస్త జీవకోటిని ప్రభావితం చేస్తున్నాయి. ఎన్నో రకాల జబ్బులకు గురిచేస్తున్నాయి. వాతావరణంలో జీవించే రోజులు లేకుండా పోయాయి.. వాతావరణ కొనసాగితే భవిష్యత్తు తరాల మనగడే ప్రశ్నార్థకం కానుంది..

అందుకే హరిత హారంతో పుడమి తల్లికి పచ్చల హారాన్ని పులుముతోంది..
రాబోయే విపత్కర పరిస్థితులను రాష్ట్ర ప్రభుత్వం భవితకు సోపానంగా హరితహారం కార్యక్రమానికి గత సంవత్సరం శ్రీకారం చుట్టింది. హరిత తెలంగాణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం గత సంవత్సరం ప్రతి మండలానికి లక్షల్లో మొక్కలు నాటింది. ప్రస్తుతం వర్షాలు సమీపిస్తుండటంతో మరోసారి హరితహారం కార్యక్రమాన్ని విజయవంతంగా చేపట్టేందుకు శ్రీకారం చుట్టింది. అధికార యంత్రాంగం, ప్రజాప్రతినిధులతో పాటు ప్రతీ ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములై మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని పిలుపునిచ్చింది. ఇల్లెందు

లో 4.59 లక్షల మొక్కలు..
ఇల్లెందు మండలంలో హరితహారం-2లో భాగంగా ఆరు మొక్కల పెంపకం జరుగుతోంది. మొత్తం 4.59లక్షల మొక్కలు నాటేందుకు సిద్ధంగా ఉన్నాయి. ఆయా నర్సరీల్లో ప్రధానంగా టేకు, చింత, కానుగ, వేప, గన్నేరు, మర్రి, రావి, నిమ్మ, సపోట, వెదురు, సీతాఫలం, జామ, ఉసిరి తదితర రకాలైన మొక్కలను పొలం గట్లు, ఇళ్లు, ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలు, అటవీశాఖ భూములు, పోరంబోకు భూముల్లో మొక్కలు నాటేందుకు అధికారులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

సత్తుపల్లి మండలంలో రెండున్నర లక్షల మొక్కలు
సత్తుపల్లి, మండలంలో హరతి హారంలో భాగంగా మండలవ్యాప్తంగా రెండున్నర లక్షల మొక్కలను నాటేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. ప్రతి గ్రామంలో 20వేల మొక్కలు నాటేందుకుప్రణాళిక తయారుచేశారు.ప్రతి ఒక్కరు తమ ఇంటి ఆవరణలో, రైతుల వ్యవసాయ భూముల వద్ద మొక్కలు నాటాలని అధికారులు సూచిస్తున్నారు. రైతులకు పొలాల గట్లపై వేసుకునేందుకు టేకు మొక్కలు, ఇళ్లలో వేసుకునేందుకు మామిడి, నిమ్మ, జామ, దానిమ్మ, సపోటా, కొబ్బరి, సీతాఫలం, మునగ, వేప, కరివేపాకు మొక్కలను ఉచితంగా ఇవ్వనున్నారు.

హరిత హారంలో ఏయే మొక్కలు నాటనున్నారు..?
వాణిజ్యమొక్కల్లో.. టేకు, సుబాబుల్, జామాయిల్ క్లోన్స్.. పూల మొక్కల్లో.. టేకోమ, గన్నేరు, మందారం, పండ్ల మొక్కల్లో..ఉసిరి, దానిమ్మ, నిమ్మ, జామ, నీడనిచ్చే మొక్కల్లో..వేప, కానుగ, రావి, మర్రి, సీమ తంగేడు, పెల్టోఫారం, గుల్మోహర్ తదితర మొక్కలు సిద్ధంగా ఉన్నాయి..
వీటిని నర్సరీల నుంచి ఆయా గ్రామాలకు తరలించేందుకు ఉచితంగా వాహనాలను ఏర్పాటు చేశారు. వివిధ సంస్థలకు చెందిన వాహనాలను ఇప్పటికే ఆయా మండలానికి చెందిన వివిధ శాఖల అధికారులు సిద్ధం చేశారు.

Leave a Reply

https://indexsy.com/